వీలుంటే నా నాలుగు లంకెలు ...

Wednesday, June 24, 2009

ఉనికి చాటుకోవడానికే 'లాల్‌ఘర్‌'

దేశంలో తమ ఉనికిని చాటుకునేందుకూ, ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకూ పశ్చిమబెంగాల్‌లోని లాల్‌ఘర్‌ను మావోయిస్టులు విముక్తి ప్రాంతంగా ప్రకటించుకున్నారని తెలిసింది. విముక్తి ప్రాంతాలుగా ప్రకటించాలని జాబితా తయారు చేసుకుని నాలుగేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. అందులో చివరన లాల్‌ఘర్‌ ఉంది. మూడు దశాబ్దాలకుపైగా పాలన సాగిస్తున్న వామపక్ష ప్రభుత్వంపై వివిధ రూపాల్లో సామ్రాజ్యవాద శక్తులు దాడి చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమై బెంగాల్‌ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు తీవ్రమైన దుష్ప్రచారం చేస్తున్నాయి. మీడియాలోని ఒక భాగం దానికి తోడ్పడుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలను కాదని స్వంత పాలనను ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో మావోయిస్టులు సాగించారు. అదే సమయంలో కొందరి నుంచి డబ్బు వసూలు చేయడం, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం లాంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడిపారని తెలిసింది. ముఖ్యంగా గిరిజనులను రెచ్చగొట్టడం, శిక్షణ ఇవ్వడం ద్వారా వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని సమాయత్తం చేసే ప్రయత్నం పథకం ప్రకారం సాగింది. సాయుధ శిక్షణ, గెరిల్లా పోరాటం ఎలా నిర్వహించాలి? విధ్వంస చర్యలను ఏ సమయంలో ఎలా సృష్టించాలన్న దానిపై జార్ఖండ్‌ మావోయిస్టులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. మావోయిస్టు పొలిట్‌బ్యూర్‌ సభ్యులు నంబాళ్ల కేశవరావు ఎలియాస్‌ గంగన్న పర్యవేక్షణలో అంతా జరిగిందని తెలిసింది. లాల్‌ఘర్‌ పోరుకు నంబాళ్ల కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు. విముక్త ప్రాంతంగా ప్రకటించుకోడానికి ముందు కేశవరావు జార్ఖండ్‌ చేరుకున్నారని, అక్కడి నుంచే లాల్‌ఘర్‌ అపరేషన్‌ పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. సాయుధ బలగాలను నిరోధించేందుకు ఏ వంతెనలు కూల్చాలి, రోడ్లెక్కడ దెబ్బతీయాలి, చెట్లను ఎక్కడ కూల్చాలి, ఎలా నిరోధించాలి అన్న దానిపై మావోయిస్టులు ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మందుపాతరలను చాలా ముందుగానే వాటిని అమర్చి ఉంచారని తెలిసింది.
మీడియాపైనా దృష్టి
తమ ఉనికిని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు మీడియాను వాడుకోవాలని మావోయిస్టులు తాజాగా నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ ప్రహ్లాద్‌ను తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా లాల్‌ఘర్‌ విషయంలో వరుసగా మూడు రోజులు మీడియాకు కోటేశ్వరరావు సమాచారమందిస్తూ తమ వైఖరిని వెల్లడించారు. ఆయన లాల్‌ఘర్‌ ప్రాంతం నుంచే ప్రకటనలు చేస్తున్నారని మీడియా, పోలీసు వర్గాలు తొలుత భావించాయి. వాస్తవంగా కోటేశ్వరరావు జార్ఖండ్‌ నుంచే మాట్లాడారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కోటేశ్వరరావు నాయకత్వంలోనే లాల్‌ఘర్‌ విధ్వంసం మొదలైందని అందరూ భావించినప్పటికీ దాని వ్యూహకర్త నంబాళ్ల కేశవరావేనని రూఢిగా తెలిసింది.
జార్ఖండ్‌లోనే కేశవరావు, కోటేశ్వరరావు?
కేశవరావు, కోటేశ్వరరావులిద్దరూ జార్ఖండ్‌లోని షెల్టర్‌ జోన్‌లో ఉన్నారని, మిగిలిన ఆంధ్ర నాయకత్వమంతా చత్తీస్‌ఘడ్‌లోనే ఉన్నారని భోగట్టా. లాల్‌ఘర్‌తోపాటు మరో ఆరు విముక్తి ప్రాంతాలను మావోయిస్టులు మున్ముందు ప్రకటించనున్నారని తెలిసింది. చత్తీస్‌ఘడ్‌లోని దంతె వాడతోపాటు మరో ప్రాంతం, ఒరిస్సాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌, జార్ఖండ్‌లో ఒక ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలోని అరకు, పాడేరు ఏజెన్సీలను కూడా విముక్తి ప్రాంతాలుగా ప్రకటించాలని లక్ష్యంగా రిక్రూట్‌మెంట్‌ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం పెద్దయెత్తున ఆయుధాలు,కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకున్నట్లు సమాచారమందింది. విముక్తి పోరాటం పేరిట గిరిజనులను సాయుధులుగా చేయాలన్న ఆలోచనలో మావోయిస్టులు ప్రణాళికలు రూపొందించు కున్నారని, సంస్కరణలు, ఆర్థిక మాంద్యం ప్రభావంతో నిరుద్యోగం పెరిగే ఈ కాలంలో విముక్తి ప్రాంతాల పోరు సాగించడం ద్వారా నిరుద్యోగ యువతను పార్టీవైపు ఆకర్షించొచ్చని అభిప్రాయపడుతున్నారు.
నేపాల్‌ అనుభవాలతో విముక్తి పోరాటం
నేపాల్‌ అనుభవాలే విముక్తి పోరాటంవైపు ఉసిగొల్పాయని మావోయిస్టులు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంవైపు రావాలని ప్రచండ ఇచ్చిన పిలుపును మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పిలుపును తిప్పికొట్టేందుకే లాల్‌ఘర్‌ను ఆయుధంగా ఎంచుకున్నారని తెలిసింది. ప్రజాస్వామ్య దేశంలో వామపక్ష ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో సాయుధ పోరాటం చేపట్టడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తమ సిద్ధాంతాలను వ్యతిరేస్తున్న వామపక్ష శక్తులను బలహీనపర్చాలన్న లక్ష్యంతోనే మావోయిస్టులు పనిచేస్తున్నారు. నేపాల్‌తో ముగిసిపోలేదనీ, తాము భారతదేశంలో ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్న ఉద్దేశం మావోయిస్టుల్లో ఉంది. విముక్తి ప్రాంతం ప్రకటించక ముందే లాల్‌ఘర్‌కు అధునాతన ఆయుధాలనూ, రాకెట్‌ లాంచర్లనూ చేరవేశారు. ప్రభుత్వంతో దీర్ఘకాల యుద్ధం చేయలేమని మావోయిస్టులు ముందుగానే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వాటి అనుభవాలను తీసుకోవడం ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచనలో వారున్నారు. ప్రభుత్వ సాయుధ బలగాలను సాధ్యమైనంత ఎక్కువ నష్టపరచాలన్న లక్ష్యంతో మావోయిస్టులు లాల్‌ఘర్‌ పరిసరాల్లో భారీ విధ్వంసక చర్యలకు పూనుకునే అవకాశముందని తెలిసింది.
...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment