వీలుంటే నా నాలుగు లంకెలు ...

Wednesday, June 24, 2009

తృణమూల్‌, మావోయిస్టుల భయానక రాజకీయాలు

ఉగ్రవాదాన్ని విస్తరింపచేయటం ద్వారా భయానక రాజకీయాలకు పాల్పడుతున్న తృణమూల్‌, మావోయిస్టు కూటమి మిడ్నపూర్‌, బంకురా తదితర జిల్లాల్లో రోడ్లు తవ్వుతూ, చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేస్తూ అభివృద్ధి మార్గాన్ని అడ్డుకోవటమే కాక ఈ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి. తృణమూల్‌నేత ఛత్రధర్‌ మహతో నేతృత్వంలోని కంగారూ కమిటీ ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతుండటాన్ని గమనిస్తున్న ఇక్కడి ప్రజలు వారి ప్రచారంలోని డొల్లతనాన్ని కూడా గమనిస్తున్నారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ, మావోయిస్టు నేత కిషన్‌జీ గత 32 ఏళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ పరిస్థితికి దారి తీశాయని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగింది గత కొన్నేళ్లుగా మాత్రమే, అదికూడా ఈ ప్రాంతంలో మావోయిస్టు, తృణమూల్‌ కూటమి అరాచకానికి పాల్పడినందువల్లే అభివృద్ధి స్థంభించిపోయింది. ఈ విషయాన్ని స్పష్టం చేసిన బెంగాల్‌ పశ్చిమ ప్రాంత అభివృద్ధి సుశాంతఘోష్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచని గ్రామాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు. బిన్‌పూర్‌1, 2 బ్లాకలేలో అధికశాతం పంచాయితీలు జార్ఖండి పార్టీ పాలనలో వున్నాయి. ఈ ప్రాంతాలలో అభివృద్ధికి నోచని ప్రాంతాలను ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో సమన్వయం చేసుకోలేని లోపం ఆ పార్టీదేనని మంత్రి వివరించారు. తాను స్వయంగా ఈ గ్రామాలకు వెళ్లి ప్రత్యేక పథకాలను మంజూరు చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ పథకాల కింద ప్రతి గ్రామంలోనూ రక్షిత మంచినీటి సరఫరా, ఆదాయ పెంపుదల, ఉపాధికల్పనతోపాటు పాఠశాలభవనం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం వంటివి చేపట్టారన్నారు. ఈ పథకాలు తొలి ఏడాది నుండే ప్రయోజనాలు అందించాయని, గత ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడినా సురక్షిత తాగునీటిని ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేశామని ఆయన వివరించారు. లాల్‌ఘర్‌, దాని పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులకు నేతృత్వం వహిస్తున్న ఛత్రధర్‌ మహతో గత వారం ఈ ప్రాంతాల్లో మీడియాలోని ఒక వర్గం ప్రతినిధులతో పర్యటించి గత 32 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేసిందేమీ లేదంటూ విషం కక్కారు. రోడ్డుకు అడ్డంగా మావోయిస్టులు తవ్విన కాలువ ఈ ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ వారి సమాధులను వారే తవ్వుకున్నారని నిరసన వ్యక్తంచేస్తూ గిరిజన గ్రామీణులు వేరు ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే వీరిని అడ్డుకుంటున్న మావోయిస్టులు తాము కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెబుతున్నారు. తాము కూడా ఇక్కడ ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నామని వారు చెప్పినప్పటికీ అక్కడెక్కడా వైద్యులు కానీ, ఔషధాలు కానీ కన్పించిన దాఖలాలు లేవు. ఇంతకు ముందే చెప్పినట్టు మావోయిస్టులు మందుపాతర పేల్చి ఒక వైద్యుడిని, నర్స్‌ను హతమార్చటంతో ఈ ప్రాంతాలకు వచ్చి సేవలందించాలంటేనే వారు హడలెత్తిపోతున్నారు.
పర్యాటకానికి గండి కొట్టిన మావోయిస్టులు
ప్రకృతిరమణీయత ఉట్టిపడుతూ గతంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ఈ ప్రాంతానికి ఇప్పుడు మావోయిస్టుల దుశ్చర్యలు గొడ్డలిపెట్టుగా మారాయి. పర్యాటక కేంద్రాలను పేల్చివేసిన మావోయి స్టులు ఈ ప్రాంతంలో పర్యాటకానికి కూడా గండికొట్టారు. అసలు ఈ ప్రాంతానికి మిగిలిన ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసేందుకు వారు రోడ్డు ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు. నిరంతరంగా కొనసాగుతున్న ఈ బెడదతను తట్టుకోలేని కంపెనీలు తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లి పోయాయి. అంతేకాదు మావోయిస్టులు ఇక్కడ ఒక వ్యూ హం ప్రకారం ఒకదాని వెంట ఒకటిగా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ధ్వంసం చేశారు. ముఖ్యంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఆర్దిక వనరులు సంపాదించు కునేందుకు భారీమొత్తంలో చెట్లను తెగనరికి టింబర్‌ మాఫియాకు తెగనమ్మేశారు.
ఈ విధంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలకు సామాన్యులనే కాక పర్యావరణాన్ని కూడా బలిపెట్టారు. మావోయిస్టుల దాడుల కారణంగా ఈ ప్రాంతంలో దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. బెంగాల్‌ పశ్చిమ ప్రాంతం, సుందర్‌బన్స్‌, ఉత్తర బెంగాల్‌ల అభివృద్ధికి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపులను 190 కోట్ల నుండి 285 కోట్ల రూపాయలకు పెంచింది. లాల్‌ఘర్‌ ప్రాంత గిరిజనులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందచేసేందుకు ఈ ప్రాంతంలోని వైద్య కేంద్రాలన్నింటి స్థాయిని పెంచింది. ఈ ప్రాంతంలో లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉమ్మడిగా దుష్ప్రచారం చేసినా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి లెఫ్ట్‌ఫ్రంట్‌ తరపున పోటీ చేసిన సిపిఎం అభ్యర్ధి పులిన్‌ బిహారీ బాస్కీకి దాదాపు 65 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.

4 comments:

  1. meeru manchi CPI synpothiser vunatunnaru ... singuru , nadhigam sangatanalu tharuvatha kudaa CPI communistulu ani nammuthunnaraa

    ReplyDelete
  2. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ బుద్ధదేబ్ కి కమ్యూనిస్ట్ లక్షణాలా? మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీదా? పాతాళంలోనా?

    ReplyDelete
  3. ప్రవీణ్ గారికి ప్రపంచ బ్యాంక్ ఏజెంట్కి, కమ్యూనిస్ట్కి తేడా తెలిసినట్లు లేదు.

    ReplyDelete