వీలుంటే నా నాలుగు లంకెలు ...

Thursday, June 25, 2009

యజ్ఞం వర్షాన్ని కురిపిస్తుందా? మంత్రాలకు చింతకాయలు రాలతాయా?

సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో వరుణదేవుడిని హోమంతో యజ్ఞం చేసి శాంతింపజేస్తే వర్షం కురుస్తుందని ఉంది. దీనికై హోమగుండంలో వేసిన నెయ్యి, కట్టెలు, ఇతర పూజాద్రవ్యాల వల్ల పొగ ఏర్పడి తద్వారా ధూళి కణాలు ఆకాశంవైపు పయనించి, మేఘం అడుగుభాగానికి చేరి వర్షింపజేస్తదని యజ్ఞం చేసేవారు నమ్ముతున్నారు. ఇప్పుడు అకాల పరిస్థితుల్లోనూ యజ్ఞం చేసి, వరుణదేవుడిని ప్రార్ధిస్తే వర్షాలు కురుస్తాయని వీరు నమ్ముతున్నారు. దీనికి ఆధారంగా ఇప్పటి మేఘమధనాన్ని చూపెడుతున్నారు. మేఘమధనం ద్వారా వెదజల్లిన లవణ కణాలలాగానే హోమధూళి మేఘాలను తాకుతుందని, ఈ కణాలు మేఘాలు వర్షించేలా చేస్తాయని వీరు చెపుతున్నారు. ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది సాధ్యమా అని ఆలోచించాలి.
అప్పట్లో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. మేఘాలు స్థిరంగా ఉండేవి. వాతావరణంలో కాలుష్యం సమస్యగా ఉండకపోయేది. ఆ పరిస్థితుల్లో ధూళి కణాలు ఏ కొద్దిగా మేఘాలని తాకినా మేఘాల్లోని తేమ నీరుగా మారి వర్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అడవులు విస్తారంగా నరికిన ఈ సమయంలో, వాహనాల కాలుష్యం పెరుగుతున్న ఈ నేపథ్యంలో గతంలోలాగా వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తు తక్కువ మేఘాలు ఉండటం లేదు. చాలా ఎత్తుగానే ఉంటున్నాయి. అటువంటప్పుడు ఈ హోమం ద్వారా వెలువడ్డ ధూళి కణాలు అసలు మేఘాల్ని చేరుకోగలవా అన్నది ప్రశ్న. వాహనాల ద్వారా వెలువడే కార్బన్‌ వాయువులు హోమం ధూళి కణాలకన్నా ఎక్కువగా విడుదలై మేఘాలను చేరి వర్షాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోమం ద్వారా వెలువడ్డ కొద్దిపాటి ధూళి కణాలు ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేఘాలకు చేరి, వర్షాన్ని కురిపించగలగటం దాదాపు అసాధ్యం. దీనిపై ప్రయోగపూర్వకంగా నిరూపితాలేమీ అందుబాటులో లేవు.

తమది దేవుడి పాలనని, వరణుడు తమ పార్టీలో చేరిపోయాడని చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు వరుణ యాగాలు చేయాలని పిలుపునిచ్చారు. పనిలో పనిగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రార్థనలు చేయాలన్నారు. ఆయా దేవాలయాలు, ధార్మిక సంస్థలు తమకు తామే అలా నిర్ణయించుకుంటే ఒక విధంగానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండే ఆదేశాలు వెళ్లడం శాస్త్ర విజ్ఞానాన్ని, సెక్యులర్‌ రాజ్యాంగాన్ని అవమానించడం, అవహేళన చేయడమే అవుతుంది. కంటింజెన్సీ ప్రణాళికల గురించి ఆలోచించకుండా పంట యజ్ఞాలు చేయమని ఆజ్ఞాపించి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇక వ్యవసాయ మంత్రి జులై 15 నుండి మేఘమథనం చేసి వర్షాలు కురిపిస్తామని చెప్తున్నారు. ఫలానా ప్రాంతంలో మేఘమథనం ద్వారా, ఫలానా సమయంలో వర్షం కురిసిందని రూఢిగా నిర్ధారించిన దాఖలా లేదు. ఇంతకీ వర్షాలు కురిస్తే యాగాల వల్ల కురిసినట్టా, ప్రార్థనలకు కరుణించినట్టా లేక మథనంతో జాలువారుతునట్టు భావించాలా? ఏది ఏమైనా ఇప్పుడు అన్నదాత సందిగ్థంలో ఉన్నాడు. సేద్యం సాధ్యం అవుతుందా? అని బెంబేలు పడుతున్నాడు. ఇంతకీ ఏరు వాక సాగేనా!?.

...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment