వీలుంటే నా నాలుగు లంకెలు ...

Thursday, July 2, 2009

పేదలు పప్పు ముఖం చూడగలరా?

ధరలను తగ్గిస్తామని చెప్పిన వైఎస్‌ సర్కార్‌ తన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఎన్నికలకు ముందు నెలకు 97 రూపాయలకు అందచేస్తున్న నిత్యావసర వస్తువులను ఇప్పుడు కేవలం 75 రూపాయలకే అందిస్తూ వైఎస్‌ సర్కార్‌ ఇప్పుడు తన ఖాతాలో మరో 'ఘనత'ను జమ చేసుకుంది. మంచం చాలకపోతే కాళ్లు నరికితే సరి అన్న సలహా పాటించిన ఫలితమే ఇది. జనం చెబుతున్నట్లుగా మార్కెట్లో అతినాసిరకం కందిపప్పును కిలో 30రూపాయలకు అందచేస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు దాని ధరను ఏకంగా 45 రూపాయలకు పెంచేశారు. కిలోకు బదులు అరకిలోకు తగ్గించారు. ధరను కూడా పెంచింది. పామాయిల్‌, కందిపప్పు సరఫరా చేసినందుకు ఏడాదికి నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఆ మొత్తాన్ని దాదాపు ఐదోవంతుకు కోతకోశారు. కందిపప్పుపై సబ్సిడీ భరించలేనిదిగా తయారైందని పౌరసరఫరాలశాఖ కొత్త మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కందిపప్పు మొదటి రకం వెల 2006 మే నెలలో కిలో 33 రూపాయలు ఉంది. ఇప్పుడు మొదటి రకం రు.58.37, రెండవరకం రు.51.67 ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ నివేదించింది. ప్రభుత్వమే ఏకంగా తానిచ్చే పప్పుధరను పదిహేను రూపాయలు పెంచింది. లక్షకోట్లరూపాయల బడ్జెట్‌ ఉన్న ప్రభుత్వమే రాయితీ ధరలకు ఒక కిలో కందిపప్పు కూడా ఇవ్వలేకపోతే పేదలు పప్పు ముఖం చూడగలరా?

No comments:

Post a Comment