వీలుంటే నా నాలుగు లంకెలు ...

Thursday, July 23, 2009

దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి?

దేవుడు ఉన్నాడని కొందరు అంటారు. లేడని కొందరు అంటారు. ఇంతకూ దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి? పూనకాలు వచ్చినవారు కేవలం నటిస్తున్నారా?
- డి.కార్తీక్‌, 9వ తరగతి, బాలభారతి పాఠశాల, ఆదిలాబాదు.


'దేవుడి'ని నమ్మేవారే వివిధ రకాలుగా భాష్యం చెబుతారు. ఈ విశ్వం మొత్తంలో ఉన్న క్రమానుగతినే మనం 'దేవుడు' అంటాము - అని కొందరంటారు. 'క్రమాను గతి' తెలుగు వ్యాకరణం ప్రకారం 'నపుంసకలింగా'నికి సంబంధించిన పదం. కాబట్టి 'దేవుడు' అంటూ పుంలింగాన్ని ఆపాదించకుండా 'దైవం' అని ఆ క్రమానుగతిని వారు పేర్కొంటే ప్రపంచంలో ఎవరికీ అభ్యంతరంలేదు. విశ్వంలో క్రమానుగతి తప్పకుండా ఉంది. 'దైవం' అనే పదం ఆ క్రమానుగతికి మరో పర్యాయపదం అని మనమూ, ప్రపంచంలోని అందరూ సర్దుకుపోగలము. ఈ విషయంలో కరుడుగట్టిన నాస్తికవాదులకు కూడా అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.
మానవజాతికి, ఇతర జీవజాతులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే మానవుడే ఆలోచిస్తాడు. క్రమమేమిటో, అక్రమమేమిటో గుర్తిస్తాడు. సాధారణ విషయాలేవో, అసాధారణ విషయాలేవో పసిగడతాడు. తన ప్రాణానికి, తనతోటి బృందపు సంక్షేమానికి ప్రమాదం వాటిల్లినపుడు ప్రమాదం కల్గించే అంశాలనే మార్చి ప్రమాదరహితంగా రూపొందిస్తాడు. ఆ క్రమంలో తనకర్థంగాని వాటిపట్ల, అసాధారణ విషయాలైన గ్రహణాలు, తోకచుక్కలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, తుపానులు, ఇంద్రధనస్సులు, ఉరుములు, మెరుపులు వంటి అరుదైన సంఘటనలపట్ల విస్మయము, సంభ్రమము, భయాందోళనలు చెందేవాడు. ప్రతి మానవ కార్యక్రమంలో మనిషి ప్రయత్నపూర్వక హస్తమున్నట్లే ఇలా అరుదుగా సంభవించే సంఘటనల పట్ల కూడా ఎవరో మానవాతీతవ్యక్తి లేదా శక్తి ప్రమేయం ఉండవచ్చునని ఊహించాడు. ప్రజల్లో సహజంగా ఉండే ఇలాంటి సందిగ్ధతను, సందేహాలను, 'దేవుడు', 'దయ్యం', 'పూజలు', సంతుష్టిపరిచే 'పబ్బాలు', 'మొక్కులు', 'బలులు', 'అప్పగింతలు', 'త్యాగాలు', 'ఆలయ నిర్మాణాలు', అనే తంతుతో పాలకవర్గాలు మొగ్గలోనే తుంచి అక్కడికక్కడ సర్దిచెప్పేవి. ఈ విధమైన తాత్కాలిక ఉపశమనంతో సర్దిచెప్పడం వల్ల ప్రజల హేతువాద దృక్పథం, తార్కిక విశ్లేషణ, సంపూర్ణ సత్యాన్వేషణాసక్తి రాటుదేలేవి కావు. క్రమేపీ 'దేవుడు', 'దయ్యం' భావాలు ప్రజల్లో ఉంటే పాలకవర్గాలకు మరింత ఊతంగా ఉండేలా సంస్కృతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితులు నెలకొన్నాయి. గత చరిత్ర అంతా ఈ విధంగానే నడిచింది. మానవజాతిలో ఏర్పడిన భౌగోళిక, భాషా పరిణామాలకు అనుగుణంగానే 'దేవుడు' అనే భావనలు, రూపాలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, స్వరూపాలు మారుతూ వచ్చాయి. మానవాతీతశక్తులు, ఏది కావాలంటే అది చేయగల మహా మహా అద్భుత కార్యకలాపాలు 'దేవుడి'కి ఆపాదించడం జరిగింది. 'దేవుడు' పాలకులకు మొదటి మిత్రుడయ్యాడు. పాలితులకు సర్దిచెప్పే సలహాదారుడయ్యాడు. యథాతథ సమాజ రూపానికి దన్నుగా నిలిచాడు. మార్పు అవసరంలేని పరిస్థితికి ఆలంబనగా తోడయ్యాడు. మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టానికి, సుఖానికి, దుఃఖానికి కారణ భూతుడయ్యేలా అదే మనిషి నమ్మే పరిస్థితికి చేరుకున్నాడు.

శక్తి సామర్థ్యాలు, రూపురేఖలు, జన్మ వృత్తాంతాలు ఆయా సమాజాల్లోని మానవ సమూహాల అభిరు చుల కనుగుణంగా 'దేవుడు', 'దైవభావన' రావడం వల్ల దేవుళ్ళు చాలామందయ్యారు. అది ఏ మానవ సమూహమైనా, వర్గ సమాజంగా ఉన్నంతవరకు ఆ దేవుడి రూపురేఖలు, ఇతర శక్తియుక్తులు, ప్రతిభలు వేర్వేరుగా ఉన్నా ఆయావర్గ సమాజాల్లో పాలకవర్గానికి బలాన్ని చేకూర్చే దేవుళ్ళుగానే వర్ధిల్లారు. వివిధ సంస్కృతులు, అలవాట్లు, భాషలు, దైవభావనలు ఉన్న మానవులు సార్వత్రిక సమస్యల పట్ల ఐక్యమవుతున్న సందర్భాలలో అదే పాలకవర్గాలు ఆయా జాతులకు అత్యంత ప్రీతిపాత్రమైన వారి వారి దేవుళ్ల భావాల మధ్య అనైక్యతను సృష్టించేవారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు. నేటికీ ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో ఇతర దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. మనిషి కష్టాలకు కారణాలు వర్తమాన ప్రపంచంలోనే, నిజజీవితంలోనే ఉన్నాయనీ, ఆ కష్టాల నివృత్తికి సమిష్టిగా పరిష్కారమార్గాలను అన్వేషించాలనీ మానవులందరూ తెలుసుకున్న రోజు 'దేవుడి' భావన ప్రజలకు అవసరం ఉండదు.

పేదరికం, దుఃఖం, వేదన, అనారోగ్యం, ఆకలి, దప్పిక, అవిద్య, క్రూరత్వం, అమానుషత్వం ప్రకృతిలో సహజమైనవి కావు. అవి ప్రకృతిలోని క్రమత్వానికి సాక్ష్యాలు కానేకావు. క్రమత్వానికి, సర్వశక్తి సంపన్నతకు ఆలవాలమైన దేవుణ్ణి నమ్మే ప్రతి సామాజికవర్గం తమ వేదనల్ని, కష్టాల్ని పోగొట్టమని వేడుకోని రోజు ఉండదు. కొన్నివేల సంవత్సరాలుగా ఆ దేవుణ్ణి పేరు పేరునా ప్రార్థిస్తున్నారు. పదే పదే పూజలు చేస్తున్నారు. కానీ వేదనలు, నొప్పులు, అకాలమరణాలు, క్రూరమైన సంఘటనలు, కష్టాలు, దుఃఖాలు మెజారిటీ మనుషుల్ని పీడిస్తూనే ఉన్నాయి. గత జన్మ పాపులుగా వారికో స్టిక్కరేసి 'మీ ఖర్మ ఇంతే' అని వారిని గిరాటేస్తున్నారు. 'చేసేది, చేయించేది, నడిపేది, నడిపించేది, కదిలేది, కదిలించేది, బాధపడేది, బాధపెట్టించేది, దుఃఖించేది, దుఃఖాన్ని కల్గించేది ఆ దేవుడేనని కష్టాల బయటున్న వారు అంటుంటే అర్థంచేసుకోలేని దయనీయపుటజ్ఞానపు మత్తులో ప్రజలుంటున్నారు. వేదన, మనోవేదన రెండింటినీ భరించేకంటే తాత్కాలిక ఉపశమనంగా మనోవేదనను మరిపించేలా విషపూరితం కాని మత్తు ద్రవ్యంగా 'దేవుడి భావన', 'దేవుడి దయ', 'దైవేచ్ఛ', 'దేవుడి లీలలు' వంటి భావజాలాలు ఉపకరిస్తున్నాయి.

క్రమత్వానికి ఆపాదించబడిన దైవభావన కేవలం ఊహలకే పరిమితమయిపోయింది. కోరికలు తీర్చేవాడిగానూ, దుష్టులని కొందరిని తయారుచేసి వారిచేత దుష్టకార్యక్రమాలను తానే చేయించి ఆ బాధలు పడేవారిని తానే తన దగ్గరకు 'దేవా రక్షించు' అని రప్పించుకొని మళ్లీ తానే దుష్ట సంహారం చేసే అర్థంగాని మనసున్నవాడిగానూ దేవుడు కీర్తించబడుతున్నాడు. పూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో మెజారిటీ ప్రజలకు కనిపించని బంధువు అయ్యాడు.

'దేవుడు ఉన్నాడా?' 'లేడా?' అన్న ప్రశ్నకు సమాధానం వెదికి తలబద్దలు కొట్టుకొనేకన్నా మనిషే మానవ చరిత్రను నడిపాడనీ, మనిషే దేవాలయాలను నిర్మించాడనీ, మనిషే విగ్రహాలను రూపొందించాడనీ, మనిషే పురాణ గ్రంథాల్ని రచించాడనీ, మనిషి అప్రమత్తంగానే శ్రమద్వారా, ప్రయత్న పూర్వకంగా చేసిన కార్యక్రమాలే మానవ జీవితాన్నీ, నాగరికతనీ, సంస్కృతినీ, వేదాంతాన్నీ, తత్త్వశాస్త్రాన్నీ రూపొందించాయన్న తిరుగులేని సత్యాన్ని అందరం నమ్ముదాము.

దేవుడి మీద నమ్మకానికీ, పూనకాలకూ సంబంధం ప్రత్యక్షంగా ఏమీ లేదు. నువ్వన్నట్లు చాలా మంది పూనకందార్లు ఏదారీ లేక పూనకపు దార్లు తొక్కుతున్నారు. హిస్టీరియా జబ్బుతో కొందరు, బాధలు వెళ్లగక్కుకోవడానికి మరికొందరు పూనకాలను పూనుకుంటున్నారు.

8 comments:

 1. హిస్టీరియా (పూనకం) ఎందుకు వస్తుందో ఏ డాక్టర్ ని అడిగినా అర్థమయ్యేలా చెప్పగలడు. అతను వ్యక్తిగతంగా దేవుడిని నమ్మినా కూడా పూనకాలకి కారణాలు సులభంగా చెప్పేయగలడు.

  ReplyDelete
 2. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లలో కూడా పశువుల కాపరుల లెవెల్ లో మూఢ నమ్మకాలు నమ్మేవాళ్ళు ఉన్నారు. 2006లో నేను సత్యసాయి బాబాకి వ్యతిరేకంగా యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేశాను. వాటిని యూట్యూబ్ ఉద్యోగులు బ్లాక్ చేశారు. యూట్యూబ్ గూగుల్ కంపెనీకి చెందినది. గూగుల్ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లలో కూడా సత్యసాయిబాబా భక్తులు ఉండడం వల్లే అలా జరిగింది.

  ReplyDelete
 3. దీనికి గూగుల్ ని తప్పు పట్టడానికి వీలులేదు. ఎందుకంటే యూటూబ్ నిబందనలప్రకారం, ఏ మతబావాలను క్రించపరిచే విషయాలను పబ్లిష్ చెయ్యకూడదు. ఏవరైన మీ వీడియో గురించి చెడుగా యూటూబ్ కి తెలయజేసి వుంటే, వెంటనే అటువంటి వాటిని తొలగిస్తారు.
  కాకపోతే, ఇక్కడ బాధ పడవలసిన విషయం ఏమంటే, సత్య సాయిబాబాను ఒక మాంత్రికుడిగ కాకుండా మత ప్రభొదికుడిగా/దేవిడుగా చూడడమే.

  ReplyDelete
 4. నేను ఆ వీడియోలు పోస్ట్ చేసిన కొద్ది సేపటికే అవి తొలిగించారు. అది ఖచ్చితంగా మత భక్తులైన ఉద్యోగులు చేసిన పనే అని చెప్పగలను.

  ReplyDelete
 5. మతరహిత పాలన గురించిన ఈ లింక్ కూడా చదవండి: http://parnashaala.blogspot.com/2009/07/blog-post_6279.html

  ReplyDelete
 6. One of the best post. Kudos

  Sridhar

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. It takes atleast 7 minutes to watch a video but all those videos were deleted in 5 minutes. The employee who deleted those videos is definitely a Hindu.

  ReplyDelete