వీలుంటే నా నాలుగు లంకెలు ...

Wednesday, July 8, 2009

మెట్రోపై భంగపాటు

భాగ్యనగర ప్రజానీకానికి ట్రాఫిక ఇక్కట్లను తొలగించి సాఫీగా ప్రయాణం సాగించటానికి వీలుగా మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న మెట్రో రైలును ఆచరణలోకి తెస్తానని గంభీర వచనాలు పలికిన ప్రభుత్వం మరోసారి భంగపడింది.8,500 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ 2007లో చెప్పింది. అందుకోసం తమ వాటాగా 1640 కోట్లు ఇవ్వడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ధనయజ్ఞం సాగిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలును ప్రభుత్వ రంగం ద్వారా కాకుండా ప్రైవేటు వారికి అప్పగించాలని, తద్వారా ప్రయోజనాలు పొందాలని ఆశించింది. 2007లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లుగా అంచనా వ్యయాన్ని నిర్ధారించినప్పటికి యేడాది తిరగకముందే దానిని 15వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం నిర్మాణ సంస్థకు చెల్లించడం కాక వారే ప్రభుత్వానికి ఎదురిచ్చేట్టు మైటాస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2008 జులైలో జరిగిన ఒప్పందం ప్రకారం మైటాస్‌ కన్సార్టియమ్‌ 34 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వానికి రు.30,311 కోట్లు ఇవ్వాలని ఆ ఒప్పందం. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం మైటాస్‌ కన్సార్టియమ్‌కు 269 ఎకరాల భూమిని అప్పంగించాలి. తద్వారా 2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు, కట్టడాలు, అడ్వర్టైజ్‌మెంట్‌లతో సహా వివిధ వాణిజ్య కార్యకలాపాలను మైటాస్‌ నిర్వహించుకుంటుంది. ఈ ఒప్పందం మోసపూరితమైనదని ప్రజలకు, ప్రజల ఆస్తులకు నష్టదాయకమైనదని లోకం కోడై కూసింది. భారత మెట్రో రైలు పితామహుడిగా పేరుగాంచిన శ్రీధరన్‌ విస్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఒప్పందంలో జరిగిన లోపాలను సవరించుకోవడం లేదా అందుకు సంబంధించిన విషయాలను చర్చిండమో చేయవల్సిన ప్రభుత్వం ఏకంగా ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని రంకెలు వేసింది. నిండు కుండ తొణకదన్నట్లు శ్రీధరన్‌ తాను చెప్పింది వాస్తవమని, అందుకు తాను కట్టుబడి వుంటానని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తోక ముడించింది.
ప్రపంచమంతా నివ్వెరపోయిన రీతిన 'సత్యం' కుంభకోణం ఈ ఏడాది జనవరిలో వెల్లడైంది. దానితో మైటాస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లించి కైంకర్యం చేసుకున్నారన్నది జగద్విదితం. హైద్రాబాద్‌ మెట్రోతో పాటు జలయజ్ఞం ప్రాజెక్టులు, మచిలీపట్నం పోర్టు కూడా మైటాస్‌ చేపట్టడానికి ఒప్పందాలు కుదిరాయి. సత్యం కుంభకోణం నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను చేపట్టడం సాధ్యమా కాదా అన్నది ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ పరిశీలించి నిర్దారణకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా మైటాస్‌తో అధికారులు పలుమార్లు చర్చించారు. మెట్రోకు సంబంధించి రెండుసార్లు వాయిదాలు కోరినా ఫైనాన్షియల్‌ క్లోజర్‌,ఆర్ధిక సామర్థ్యంలను మైటాస్‌ కన్సార్టియమ్‌ చూపలేకపోయింది. అందుకని మెట్రోపై మైటాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి రామనారాయణరెడ్డి ప్రకటించారు.
మనదేశంలో మొట్టమొదటి మెట్రో వ్యవస్థను కలకత్తాలో నిర్మించారు. అది విజయవంతం అయ్యాక ఢిల్లీలో కూడా ప్రభుత్వ రంగంలో చేపట్టారు. మెట్రో వ్యవస్థ పెరుగుతున్న మహానగరాల్లో ప్రజలకు చౌకగా, వేగంగా రవాణా సౌకర్యం కల్గించటమే కాక వాతావరణ కాలుష్యాన్ని సమర్థవంతంగా అదుపు చేస్తుంది. సాంకేతికంగా ఆధునాతనమైనది, రిస్కుతో కూడుకున్నది కనుక ప్రజలకు భద్రతతో ముడిపడిన ఈ వ్యవస్థను ప్రభుత్వం నిర్మించడం, నిర్వహించడం చాలా అవసరం.అందుకు భిన్నంగా ముంబైలో మెట్రో రైలు ఒప్పందాన్ని ప్రైవేటు సంస్థతో చేసుకోగా అది విఫలమైంది. ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ రీత్యా మెట్రో రైలులాంటి మౌలిక వ్యవస్థలు ప్రభుత్వం చేతుల్లో ఉండడం ఆవశ్యం. కాని ప్రైవేటును నెత్తికెక్కించుకునే సరళీకరణ విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను, భద్రతను పణంగా పెడుతున్నాయి. మెట్రో రైలు ఒప్పందంలో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది జనవాక్యం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీధరన్‌ లాంటి ప్రఖ్యాత టెక్నోక్రాట్‌ అభిప్రాయాన్ని తుంగలో తొక్కడమే కాక ఎదురుదాడికి దిగింది.జరిగిన పరిణమాలను పరిశీలిస్తే శ్రీధరన్‌ మాటలు ఎంతటి సత్యాలో ఎవరికయినా బోధపడుతుంది. జాప్యం మూలంగా మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం పెరిగి పోతున్నది.భాగ్యనగరం అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వీలున్నంత తొందరంగా మెట్రో రైలు నిర్మాణం జరగాలి. అదీ ప్రభుత్వ రంగంలోనే జరిగితే ప్రజలకు శ్రేయస్కరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం, శ్రీధరన్‌ సూచించిన పద్ధతిలో మెట్రోను చేపట్టడం మంచిది.కేంద్ర పట్టణాభివృధ్ధిశాఖను నిర్వహిస్తున్నది తెలుగువాడు. యుపిఎకు అత్యధిక మందిని సమకూర్చిన రాష్ట్రంగా మనకు ఆపాటి ప్రయోజనం కూడా జరగకపోతే ఇంకెందుకు?ప్రభుత్వం చురుకుగా కదిలి కేంద్ర అనుమతిని,నిధులను సాధించాలి. మొట్రో ఉదంతం నుండి వైయస్‌ ప్రభుత్వం గుణపాఠం తీసుకోవాలి.

3 comments:

 1. >>>>>
  మెట్రో రైలు నిర్మాణం జరగాలి. అదీ ప్రభుత్వ రంగంలోనే జరిగితే ప్రజలకు శ్రేయస్కరం.
  >>>>>
  ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఇవ్వకపోతే కమిషన్లు రావు. మైటాస్ ని కాకపోతే మరో ప్రైవేట్ సంస్థని మేపుతారు.

  ReplyDelete
 2. మెట్రో ప్రోజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది నాకు సందేహమే. మెట్రో ట్రైన్‌లు ఎలెవేటెడ్ (స్థంభాల మీద వేసిన) పట్టాల మీద నడుస్తాయి కాబట్టి మెట్రో లైన్‌ల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకోసం బోలెడంత సిమెంట్, ఇనుము ఉపయోగించాలి. ఆ సిమెంట్, ఇనుముతో గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో కొత్త రైల్వే లైన్‌లు వెయ్యడం సులభం. గ్రామీణ ప్రాంతాలలో రైల్వే లైన్‌లు వెయ్యడానికి డబ్బులు లేవని రైల్వే శాఖ మీనమేషాలు లెక్కపెట్టుకుంటోంది. అటువంటప్పుడు చాలా ఖరీదైన మెట్రో ప్రోజెక్ట్ పూర్తవుతుందంటే సందేహమే. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎక్కువ కనుక మెట్రో లైన్‌లకి లాభాలు వస్తాయని సమాధానం చెప్పగలరు. కానీ నిర్మించడానికి డబ్బులు ఉన్నాయా, లేదా అనేదే ప్రధాన సందేహం. రాష్ట్రంలో బస్ చార్జిలు పెరిగాయి. రైల్వేవాళ్ళు కొన్ని రూట్లలో విద్యుత్ ఇంజిన్‌లు నడుపుతున్నారు కనుక డీజిల్ ధరలు వాళ్ళకి భారం కాలేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో రైల్వే లైన్‌లు వేస్తే రైల్వేవాళ్ళకి లాభమే. ఈ పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాలలో రైల్వే లైన్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టడమే మేలు.

  ReplyDelete
 3. ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడని ఈ టైమ్‌లో మెట్రో ప్రోజెక్ట్ పూర్తవ్వడం కష్టమే.

  ReplyDelete